100 day plan | ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక | Eeroju news

100 day plan

ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక

విజయవాడ, ఆగస్టు 28  (న్యూస్ పల్స్)

100 day plan

ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నర నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన, ప్రణాళికపై దృష్టి పెట్టింది. మొదటి 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో ఆ మేరకు లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ టార్గెట్ పై దృష్టి సారించాయి అన్ని శాఖలు.. సెప్టెంబర్ 22వ తేదీకి 100 రోజుల పూర్తికానున్నాయి. ఇక కేవలం 26 రోజుల గడువు మాత్రమే ఉండడంతో వడివడిగా 100 ప్రణాళికకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రజల కోటి ఆశలతో జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.

అసహజమైన మెజారిటీ, అసాధారణమైన ఆధిక్యత దక్కించుకున్న కూటమి తమపై ప్రజల అంచనాలను నిలబెట్టుకునేందుకు పెద్ద ఎత్తున మార్పులు చేసి చూపించాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళిక లిఖించుకుంది. మొదటి వంద రోజుల్లో పాలనలో మార్పు తెచ్చామన్న వైఖరిని అవలంభించాలని ఆదేశించింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎన్నికల ప్రచారంలో పదేపదే ఎత్తి చూపిన కూటమి నేతలు 100 రోజుల్లో వాటిని సరిదిద్దడంతో పాటు సాధించిన విజయాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు వంద రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ గమ్యాన్ని చేరే విధంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

దాంతో అన్ని శాఖలు అందుకు సన్నద్ధమై దాదాపు తమ లక్ష్యాల్ని చేరుకునే దశలో ఉన్నాయి. ఇక అందుకు గడువు కేవలం 26 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి ప్రభుత్వ శాఖలు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టే ప్రాధాన్య కార్యక్రమాల ప్రతిపాదనలను వివిధ శాఖలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీల అమలుకు వివిధ శాఖల ప్రతిపాదనలుపై ప్రభుత్వం కూడా పలు సూచనలు చేసింది. ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు తీసుకున్నాక ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నెలలుగా నిరంతరం అన్ని శాఖలను సమీక్షించారు.. సమీక్షల సమయంలోనే ఆ 100 రోజుల ప్రతిపాదనలపై దిశానిర్దేశం చేయడంతో అధికారులు శరవేగంగా ముందుకు వెళ్తున్నారు.

ఈ ప్రతిపాదనలతో కీలకమైనవి ఒకసారి చూస్తే గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ, రాజధాని అమరావతిలో అసంపూర్తి నిర్మాణాల పూర్తికి చర్యలు, రాజధాని నిర్మాణం పై ప్రణాళికలు సిద్ధం చేయడం, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడనుంచి తిరిగి ప్రారంభించాలనే అంశాలను చాలా కీలకంగా తీసుకుంది ప్రభుత్వం. వీటితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించి 90 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాల అందజేత, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటన, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు, తల్లిదండ్రులపై భారం లేకుండా కళాశాలలకే ఫీజు రీఎంబెర్స్మెంట్ చెల్లింపులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఇన్సెంటివ్స్ ప్రకటనతో ఆయా శాఖల వారీగా వచ్చిన అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే హోంమంత్రి అనిత ఉన్న స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకి అనేక ప్రతిపాదనలని సిద్ధం చేసుకుని అందులో భాగంగా ముందుకు వెళ్లడం కూడా జరుగుతుంది.

అలాగే అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ ఐఐటి బృందాల చేత వాటిని పరిశీలింప చేసి వాటిపై ఒక నివేదికను కూడా తెప్పించుకున్నాయి. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక అందినప్పటికీ ప్రభుత్వం ప్రస్తుతం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటుంది. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించేలా అందుకు అవసరమైన జంగిల్ క్లియరెన్స్ ని ఇప్పటికే ప్రారంభం చేసి సగం పూర్తి చేసుకుంది.. అలాగే ఉచిత ఇసుకపై ఇప్పటికే ప్రభుత్వం పాలసీ ప్రకటించింది.

అలాగే 100 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న మరికొన్ని శాఖల ప్రతిపాదనలు చూస్తే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కాపు భవన్ నిర్మాణాల పూర్తికి చర్యలు, నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు, క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల అభివృద్ధి బోర్డు, ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమ కార్పొరేషన్, తోట చంద్రయ్య, ఇతరుల హత్యలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లింపు, సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు గౌరవ వేతనాల పెంపు పరిశీలన, ఆశా కార్యకర్తల వేతనాలు పెంపు పరిశీలన, డిజిటల్ ఆరోగ్య కార్డుల కార్యక్రమం ప్రారంభం, గుండె వైద్య పరీక్షలు, చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ, జూనియర్ లాయర్ల స్టైఫండ్ పెంపు, శాశ్వత కుల ధ్రువపత్రాలు అందజేత, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభ లు ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకం పనుల తీర్మానాలు లాంటివి ఈ 100 రోజుల ప్రణాళికలో ఉన్నాయి.వీటిలో చాలా వరకు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావొచ్చాయి.

ఉదాహరణకు రాష్ట్రంలోని 13326 గ్రామపంచాయతీలో ఇప్పటికే గ్రామ సభలు పూర్తిచేసి ఉపాధి పనుల తీర్మానం కూడా పూర్తయింది. అలాగే కార్పొరేషన్ ల ఏర్పాటు లాంటివి ప్రాసెస్ ప్రారంభమై తుది దశకు చేరుకున్నాయి. కావున మరొక 26 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరలో వీటిని పూర్తి చేసి ప్రకటించడానికి శాఖలన్ని సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ స్థాయిలో మార్పులు చేశామని.. కావున ప్రజలు పెట్టుకున్న ఆశలు, అంచనాలు వమ్ము చేయమని ప్రభుత్వం బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. 100వ రోజు పెద్ద ఎత్తున వేడుకలా కార్యక్రమాలు నిర్వహించి వీటన్నిటిని ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

100 day plan

 

Chandrababu | చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం | Eeroju news

Related posts

Leave a Comment