డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror
డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. చైనా, కెనడా, మెక్సికో.. ఇలా ఒక్కో దేశంపై వరుసపెట్టి సుంకాల మోత మోగించేస్తున్నాడు. దాంతో ఆ దేశాలూ ప్రతికార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులను వారు పెద్దఎత్తున వెనక్కి తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు టారిఫ్ షాక్‌తో మన కరెన్సీ మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ మళ్లీ పుంజుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత క్షీణించవచ్చని, పసిడి పరుగు ఆపక పోవచ్చని విశ్లేషకులంటున్నారు.
సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్
ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. సెన్సెక్స్ ఒక దశలో 749.87 పాయింట్లు కోల్పోయి 76,756.09 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి కాస్త కోలుకున్న సూచీ.. 319.22 పాయింట్ల నష్టంతో 77,186.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 121.10 పాయింట్లు కోల్పోయి 23,361.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 20 నష్టపోయాయి. ఎల్ అండ్ టీ షేరు 4.64 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు 2 శాతానికి పైగా విలువను కోల్పోయాయి. ప్రధాన షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీల స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.77 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం పతనమయ్యాయి. రంగాల వారీ సూచీల్లో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 4.29 శాతం క్షీణించగా.. ఇండస్ట్రియల్స్ 3.79 శాతం, పవర్ 3.30 శాతం నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎ్‌సఈలో మొత్తం 4,184 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,962 నేలచూపు చూశాయి. 1,075 లాభపడగా..147 యథాతథంగా ముగిశాయి. 117 కంపెనీల షేర్లు ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 3 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. కాగా, మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.419.54 లక్షల కోట్లకు (4.82 లక్షల కోట్ల
రూ.87 దాటిన డాలర్
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్కరోజే 49 పైసలు క్షీణించి రూ.87.11 వద్ద ముగిసింది. ఒక దశలో ఎక్స్ఛేంజ్ రేటు ఏకంగా 67 పైసల నష్టంతో రూ.87.29 స్థాయికి చేరినప్పటికీ.. మన కరెన్సీ మళ్లీ కాస్త కోలుకుంది. డాలర్‌తో మారకం రేటు రూ.87 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. టారి్‌ఫల ప్రభావంతో అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటంతోపాటు ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు కారణమయ్యాయి. ముడి చమురు ధరల పెరుగుదల కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది. డాలర్ క్రమంగా బలపడుతుండటంతో పాటు మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతున్న నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అన్నారు. ఆర్బీఐ జోక్యం చేసుకుంటే మన కరెన్సీకి కొంత మద్దతు లభించవచ్చన్నారు. కాగా, 6 అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 1.01 శాతం పెరిగి 109.46కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర ఒక దశలో 1.41 శాతం పెరిగి 76.74 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
@: రూ.85,000
పసిడి మళ్లీ కొండెక్కుతోంది. దేశీయంగా ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం రేటు 10 గ్రాములు మరో రూ.400 పెరుగుదలతో రూ.85,300కు చేరుకుంది. పసిడి రూ.85,000 మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. వెండి సైతం కిలోపై రూ.300 పెరుగుదలతో రూ.96,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఎగబాకడంతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు ప్రధాన కారణమయ్యాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను క్రమంగా బులియన్ వైపు మళ్లిస్తున్నారని బులియన్ నిపుణులు చెబుతున్నారు.