టీచర్ల కోసం వేడుకోలు.. | Eeroju news

టీచర్ల కోసం వేడుకోలు..

టీచర్ల కోసం వేడుకోలు..

ఏలూరు, జూలై 16, (న్యూస్ పల్స్)

రాష్ట్రంలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో పాఠ‌శాల కోసం తాము మ‌ట్టితో షెడ్‌ను నిర్మించుకున్నామ‌ని, ఉపాధ్యాయుడిని పంపాల‌ని గిరిజ‌న గ్రామ ప్రజ‌లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్పంద‌న కోసం ఆ గిరిజ‌న గ్రామం ఎదురు చూస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండ‌లం కివ‌ర్ల పంచాయ‌తీ తెంగ‌ల్ బంధ గ్రామంలో 28 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మొత్తం 136 మంది జ‌నాభా ఉన్నారు. వీరంతా కొండ‌దొర ఆదివాసీ గిరిజ‌న‌లు, వీరు కొండ చిట్టచివ‌ర జీవ‌నం సాగిస్తున్నారు.

ఆ గ్రామంలో పిల్లలు చ‌దువుకోవ‌డానికి పాఠ‌శాల లేదు. తెంగ‌ల్ బంధ గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా గంగ‌వ‌రం గ్రామంలోని మండ‌ల ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. అయితే రెండు వాగులు దాటుకొని, స్కూల్‌కి వెళ్లి రావాల్సి వ‌స్తుంది. దాదాపు నాలుగు కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూ స్కూల్‌కి వెళ్లి రావాల్సి ఉంటుంది. అయితే రెండు వాగులు దాటాల్సి రావ‌డంతో వ‌ర్షాకాలంతో వాగులు పొంగిపొర్లుతాయి. వేగ‌వంతంగా ప్రవ‌హించే వాగుల‌ను చిన్నారులు దాటాల్సి వ‌స్తుంది. ఒక్కొసారి నీటి ఉద్ధృతికి వాగుకు వైపు పిల్లలు, మ‌రోవైపు త‌ల్లిదండ్రులు గంట‌ల త‌రబ‌డి ఉండిపోవాల్సి వ‌స్తోంది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో వాగుల ప్రవాహం పెరిగింది. దీంతో ఆ వాగుల‌ను విద్యార్థులు దాట‌లేక విద్యకు దూరం అవుతున్నారు.

వారి పిల్లల బాధ‌ల‌ను చూసి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేపట్టారు. దీంతో ఈ స‌మ‌స్య ఆ నోటా, ఈ నోటా వ్యాప్తి చెంది మీడియా క‌థ‌నాల‌తో అధికారుల స్పందించాల్సి వ‌చ్చింది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా క‌లెక్టర్ ఆదేశాల మేర‌కు అనంత‌గిరి ఎంఈఓ తెంగ‌ల్ గ్రామాన్ని సంద‌ర్శించారు. అప్పుడు మీరు పాఠ‌శాల కోసం రేకుల షెడ్ నిర్మిస్తే టీచ‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయ‌త్నిస్తామ‌ని గ్రామ‌స్థుల‌తో ఎంఈఓ అన్నారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రజ‌లంతా స‌మావేశం అయ్యారు. ఎలాగైనా పిల్లల భ‌విష్యత్తు కోసం పాఠ‌శాల‌ను నిర్మించుకోవాల‌ని, అది కూడా వారం రోజుల్లోనే నిర్మించుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. అలాగే గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం రూ. 500 చొప్పున చందాలు పోగేశారు.

సొంత ప‌నులు, పొలం ప‌నులు మానుకొని గ్రామ‌స్థులంతా రేకుల‌తో షెడ్‌ను నిర్మించారు. షెడ్‌కు చుట్టు మ‌ట్టిగోడ‌లు క‌ట్టారు. దీనికోసం గ్రామంలోని మ‌హిల‌లు, పురుషులు, చిన్నా పెద్ద అంద‌రూ క‌ష్టప‌డ్డారు. రేకులు షెడ్ పాఠ‌శాల నిర్మించుకున్నామ‌ని, త‌మ‌కు ఉపాధ్యాయుడిని పంపాల‌ని తెంగ‌ల్ బంధ గ్రామ ప్రజ‌లు కోరుకుంటున్నారు. ఈ మేర‌కు క‌లెక్టర్‌ను క‌లిసి సీపీఎం జిల్లా కార్యవ‌ర్గ స‌భ్యులు కె. గోవింద‌రావు, గిరిజ‌న సంఘం నాయ‌కులు పాండ‌వుల స‌త్యారావు, గ్రామస్థులు విన‌తి ప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఉపాధ్యాయుడిని ఏర్పాటుకు క‌లెక్టర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని ఆదివాసీ గిరిజ‌న‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ గ్రామానికి టీచ‌ర్‌ను నియ‌మించాల‌ని జిల్లా క‌లెక్టర్‌కు, ప్రాజెక్ట్ అధికారి (పీఓ)కి ఆదివాసీ గిరిజ‌న పిల్లలు, పెద్దలు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

 

టీచర్ల కోసం వేడుకోలు..

 

Transfers of teachers cries of students | టీచర్ల బదిలీలు…విద్యార్దుల రోదనలు | Eeroju news

Related posts

Leave a Comment